మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై అడ్లూరి ఫైర్
పదిేళ్ల అరాచకాలు,అవినీతి త్వరలో ప్రజల ముందే ఉంచుతా
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పది సంవత్సరాలుగా కొప్పుల ఈశ్వర్ పాలనలో జరిగిన అరాచకాలు, అవినీతి వ్యవహారాలన్నింటినీ త్వరలో ప్రజల ముందుంచుతామన్నారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మీ ప్రభుత్వం మీ నాయకత్వమే మారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఒక్క సంక్షేమ హాస్టల్ భవనం కూడా నిర్మించలేదన్న నిజం ప్రజలందరికీ తెలుసని అడ్లూరి పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి చేయని మీరు నాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేసిన అడ్లూరి ప్రజల తీర్పే మీ రాజకీయ వైఫల్యానికి తుది తీర్పుగా నిలుస్తుందన్నారు. ప్రజలే మీకు సరైన గుణపాఠం చెబుతారని స్పష్టం చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటపెడతామని హెచ్చరించారు.


