కాకతీయ, తెలంగాణ బ్యూరో: కరూర్ తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, విజయ్ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీవీకే స్పష్టం చేసింది. పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలు, బహిరంగ సభల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది.
ఇకపోతే, పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత వచ్చే వారం విజయ్ కరూర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్కడ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించనున్నారు.
గత శనివారం రాత్రి కరూర్‌లో విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 41 మంది మృతిచెందగా, మరో 60 మందికిపైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు విజయ్ తనవంతుగా రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించగా, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా నిర్ణయించింది.
అంతేకాకుండా, ఈ ఘటనలో కుట్ర కోణం ఉన్నదని టీవీకే ఆరోపిస్తోంది. దర్యాప్తు జరపాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటనపై విజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఆయన వీడియో సందేశం విడుదల చేసి, బాధిత కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


