- నాయకుడు ప్రజల మధ్యనే ఉండాలి
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపికలో కొత్త ఒరవడి
- ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక హంగల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మనె
కాకతీయ, కరీంనగర్ బ్యూర్ : కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన నూతన నియామక విధానంలో భాగంగా, కరీంనగర్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులుగా కర్ణాటక హంగల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మనె, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆత్రం సుగుణ, చిట్ల సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మనె మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీకి, ప్రజలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరించగల వ్యక్తి కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించి, నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉండాలన్నదే మా లక్ష్యం అన్నారు. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగిన ఈ ప్రక్రియ, ఇప్పుడు ఆరో రాష్ట్రంగా తెలంగాణలో అమలు అవుతోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 22 మంది ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ నేతలు ఈ నియామకాల్లో భాగంగా పనిచేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, అభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాత తుది నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు సమర్పించనున్నట్టు తెలిపారు. సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమతు హుస్సేన్, పీసీసీ కోఆర్డినేటర్ బాలకృష్ణ, నేతలు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, మడుపు మోహన్, పత్తి మధు, పురం రాజేశం, ముస్తాక్, అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.


