- డీఎంహెచ్‌ఓ వాణి శ్రీ
కాకతీయ, పెద్దపల్లి : లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం1994 ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అని చెప్పడం, అడగడం రెండూ నేరమని డీఎంహెచ్‌ఓ వాణి శ్రీ హెచ్చరించారు. బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.వి. వాణి శ్రీ అధ్యక్షతన పిసిపిఎన్డిటి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వాణి శ్రీ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 32 స్కానింగ్ కేంద్రాలు రిజిస్ట్రేషన్ పొందాయని, ప్రతి నెలా పది కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని ఆమె తెలిపారు.
లింగ నిర్ధారణ చేసిన వారికి లేదా చేయమని అడిగినవారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. రెన్యువల్ కోసం వచ్చిన స్కానింగ్ కేంద్రాల దరఖాస్తులను పరిశీలించి జిల్లా అప్రోప్రియేట్ కమిటీకి సిఫారసు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రామగుండం దరఖాస్తు కూడా ఉన్నదని ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీలకు చేసే స్కానింగ్ వివరాలను ఫారం ఎఫ్ ద్వారా నమోదు చేయాలని కమిటీ సభ్యుడు కె. రాజగోపాల్ సూచించారు. సమావేశంలో డా. రవీందర్, పి రాకేష్, కె.రాజగోపాల్, స్నేహ శ్రీపతి, జగన్, ఎస్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


