నిషేధిత పొగాకు విక్రయిస్తే చర్యలు తప్పవు
వర్ధన్నపేట ఎస్‌ఐ సాయి బాబు
కాకతీయ. వర్ధన్నపేట : వర్దన్నపేట మండలంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల పరిసర ప్రాంతాల్లోని కిరాణా షాపులు, పాన్ డబ్బాలలో గుట్కా, అంబర్, సిగరెట్లు వంటి ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.ఈ మేరకు వర్దన్నపేట సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్. సాయిబాబు హెచ్చరిక జారీ చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న దుకాణదారులపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకించి పాఠశాలలు, కాలేజీల సమీపంలో ఇటువంటి విక్రయాలు పూర్తిగా నిషేధమని, ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే సహించబోమని స్పష్టం చేశారు. యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. అదేవిధంగా, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎక్కడైనా నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే ఈ అక్రమాలను పూర్తిగా అరికట్టగలమని ఎస్‌ఐ సాయిబాబు వెల్లడించారు.


