ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు
డిప్యూటీ వార్డెన్, హెచ్‌ఎం సస్పెన్షన్
కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థత
నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశం
కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై జిల్లా కలెక్టర్ అంకిత్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ డిప్యూటీ వార్డెన్ మరియు హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఆదివారం రాత్రి హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడిన విద్యార్థినులను వెంటనే మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మొత్తం ఇరవై నాలుగు మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణం హాస్టల్‌లో తయారు చేసిన కలుషిత ఆహారమేనని ప్రాథమికంగా తేలింది. కనీస ఆహార నియమ నిబంధనలు పాటించకపోవడం, నాణ్యమైన ఆహారం అందించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.
కఠిన చర్యలు
ఈ ఘటనపై స్పందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్, హెడ్‌మాస్టర్‌లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని హాస్టళ్లలో ఆహార నాణ్యతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


