- కార్పొరేటర్‌ను వెంటనే బైండోవర్ చేయాలి
- లేకుండా బోరబండలో ఎన్నికలు సజావుగా సాగవు
- కాంగ్రెస్‌కు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా..?
- అతడికి గన్ మెన్లను ఇవ్వడంపై ఈసీని కలుస్తాం..
- పోలీసుల తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్‌పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బాబా ఫసీయుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్పీ పోలీసులను డిమాండ్ చేశారు. ఈమేరకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్థానిక నాయకులు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన సర్దార్ కుటుంబ సభ్యులతో కలిసి బోరబండ పోలీస్ స్టేషన్ వచ్చి ఇన్‌స్పెక్టర్‌ను కలిసి మాట్లాడారు. బెదిరింపులకు పాల్పడి, సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పి, బహిరంగంగా అందరినీ బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్‌ను పోలీసులు ఎందుకు బైండోవర్ చేయడం లేదని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. 5 నెలలు గడిచినా కేసులో పురోగతి ఎందుకు లేదు ? పైగా అతనికే గన్‌మెన్లను ఇచ్చి స్టార్ క్యాంపెయినర్‌ను చేసి మంత్రుల వెంట తిప్పుతున్నారు అని మండిపడ్డారు.
కాంగ్రెస్‌కు ఒక న్యాయం.. ఇతరులకు మరొక న్యాయమా..? అని ఎన్నికల సంఘాన్ని, హైదరాబాద్ సీపీని ప్రశ్నించారు. వెంటనే ఈ బాబాను అరెస్ట్ చేసి, రౌడీషీట్ ఓపెన్ చేసి జైలుకు పంపాలి. లేదంటే బోరబండలో ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బాబా ఫసీయుద్దిన్ ఆగడాలు దారుణంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గంజాయి బకెట్లు ఇంట్లో పెట్టి అక్రమ కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారన్నారు. రైతులకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే కేసు పెట్టి నల్లబాలు, దిలీప్ కొణతం, గౌతమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులకు బాబా ఫసీయుద్ధిన్ మాత్రం దొరకడం లేదా అని ప్రశ్నించారు. అరెస్ట్ చేయడం లేదు, బైండోవర్ చేయడంలేదు, కనీసం పోలీస్ స్టేషన్ కు పిలిపించడం లేదని మండిపడ్డారు. బాబా ఫసీయుద్దిన్ కు గన్ మెన్లను ఇవ్వడంపై ఎన్నికల కమిషన్, హైదరాబాద్ సీపీని కూడా కలుస్తామని ఆర్ఎస్పీ అన్నారు.


