కాకతీయ, హనుమకొండ : ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో సెలవు రోజుల్లో అనుమతి లేకుండా తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. ఈ విషయంపై భారత రాష్ట్ర విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ చారి సోమవారం డీఐఓ గోపాల్ కు ఫిర్యాదు చేసి ఫిర్యాదు పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ సుజాతక అందజేశారు.
ఈ సందర్భంగా రాకేష్ యాదవ్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా కళాశాల తరగతులు నిర్వహించడం అన్యామని, అనుమతుల గురించి ప్రశ్నిస్తే పోలీసుల అనుమతి ఉందని యాజమాన్యం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందని అన్నారు. విద్యార్థులపై అనవసర ఒత్తిడి తెచ్చి, వారిని మానసికంగా కుంగదీసే పరిస్థితులు కార్పొరేట్ కళాశాలలు సృష్టిస్తున్నాయన్నారు. ఇరుకు గదుల్లో, కనీస వసతులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేసి విద్యను వ్యాపారం చేస్తున్న ఆల్ఫోర్స్ కళాశాలను ప్రభుత్వమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి కార్పొరేట్ శక్తుల ఒత్తిళ్లకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల బాధ్యులను ప్రశ్నించగా, విద్యార్థి నాయకులపై దౌర్జన్యం జరిగిందని రాకేష్ యాదవ్ తెలిపారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కార్పొరేట్ కళాశాలలకు అధికారులు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. కళాశాల ముట్టడి కార్యక్రమంలో విద్యార్థి నాయకులు స్నేహిత్, శ్రవణ్, వరుణ్, రాజు, మహేష్, అనిల్, ప్రణయ్, ఆదిత్య, సునిల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.


