ఏసీపీ నందిరాంపై సస్పెన్షన్ వేటు
ఆయనతో పాటు ఇన్‌స్పెక్టర్ గోపి, ఎస్‌ఐ విఠల్‌పై వేటు
మట్టెవాడ పీఎస్‌లో పనిచేసిన సమయంలో తప్పుడు కేసులు నమోదు
విచారణ నివేదిక ఆధారంగా డీజీపీ చర్యలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కలకలం
కాకతీయ,వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసులు నమోదు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్, ప్రస్తుతం సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న గోపి, అలాగే ఎస్‌ఐ విఠల్ను సస్పెండ్ చేశారు. వీరు వరంగల్ కమిషనరేట్ పరిధిలో పని చేసిన సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారణ
ఈ ఫిర్యాదులపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. విచారణలో తప్పుడు కేసుల నమోదు, విధి నియమావళి ఉల్లంఘన జరిగినట్లు తేలడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదికలో సిఫార్సు చేశారు. ఆ నివేదిక ఆధారంగానే డీజీపీ ఈ ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణ, నిష్పక్షపాతత్వం ఎంతో కీలకమని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. తప్పుడు కేసులు నమోదు చేసి ప్రజలను వేధించే వారిపై ఎంతటి ఉన్నత హోదా ఉన్నా చర్యలు తప్పవన్న సంకేతాన్ని ఈ సస్పెన్షన్ల ద్వారా ప్రభుత్వం పంపిందని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సస్పెన్షన్‌తో పాటు ఈ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు జరిగే అవకాశముందని సమాచారం. అవసరమైతే శాఖాపరమైన చర్యలు, క్రిమినల్ కేసుల దిశగా కూడా అధికారులు పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కలకలం రేగింది.


