- రిమాండ్ కు తరలింపు
కాకతీయ, నల్లబెల్లి: మండలంలోని కొండాపురం గ్రామంలో జరిగిన హత్య కేసులో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న రాత్రి కొండాపురం గ్రామానికి చెందిన మెరుగుర్తి రమేష్ తన తల్లి సమ్మక్కతో ఇంటి జాగా పంచి ఇవ్వమని వాదనకు దిగాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతడి తమ్ముడు మెరుగుర్తి సురేష్ “నేను నీకు ఇచ్చిన పదివేల రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు.. పైగా అమ్మతో గొడవ ఎందుకు చేస్తున్నావు?” అని అన్నపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అన్నదమ్ముల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఆగ్రహానికి గురైన సురేష్ కత్తితో అన్న రమేష్ పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రమేష్ భార్య ఇరుగుర్తి స్వరూపను కూడా సురేష్ ఛాతి భాగంలో కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గాయపడిన రమేష్, స్వరూపను స్థానికులు వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె అదే రాత్రి మృతిచెందింది. ప్రస్తుతం రమేష్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు మెరుగుర్తి సురేష్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు సీఐ సాయి రమణ, ఎస్సై గోవర్ధన్ తెలిపారు.


