కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసులో సారంగాపూర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 27న సాయంత్రం రేచపల్లి గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీష్ (30) తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా నాథరి వినంజి, నాథరి శాంత, నాథరి జల అలియాస్ శనిగరపు జల సతీష్ పై దాడి చేశారు. సతీష్ గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో నిందితుల కుటుంబానికి చెందిన ఓ మహిళతో దిగిన ఫోటోను పోస్ట్ చేసి, ఆమె తన ప్రేమికురాలు అంటూ ఆ పోస్ట్ లో తెలిపాడు.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న నిందితులు అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో సెప్టెంబర్ 27న నిందితులు సతీష్ ఇంటిలోకి చొరబడి, మిరప పొడి చల్లి, కర్రలతో అతడి తలపై విచక్షణారహితంగా దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితులు ఘటనా స్థలం నుండి పరారయ్యారు. కాగా మృతుడి తండ్రి ఎదురుగట్ల రాజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే 29న ఉదయం 10 గంటల సమయంలో రేచపల్లిలోని టీ-జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, హత్యకు ఉపయోగించిన కర్రలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.


