జనగణనలో ఖచ్చితత్వం కీలకం
జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం
టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ
కాకతీయ, జనగామ : జనగణన 2027 ఫేజ్–1లో భాగంగా గృహాల జాబితా, గృహ గణన (హెచ్ ఎల్ ఓ ) నిర్వహణకు సంబంధించి నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం అత్యంత కీలకమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక సమాచారం సేకరణలో జనగణన ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి వివరాన్ని నిర్దిష్టంగా నమోదు చేయాలని సూచించారు. డేటా సేకరణలో పారదర్శకత పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. శిక్షణలో చెప్పే ప్రతి అంశాన్ని శ్రద్ధగా వినుతూ, సమగ్రంగా నేర్చుకోవాలని పాల్గొనేవారిని ఆయన కోరారు. మార్చి 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సీపీఓ చినకోట్యా నాయక్, శిక్షకులు రవి నాయక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


