చూస్తుండగానే ఖాతా ఖాళీ
సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం
గంటల్లోనే లక్షల రూపాయలు గాలిలో కలిసిన ఘటన
ఆలయ ఉద్యోగి ఖాతా నుంచి రూ.10 లక్షలు మాయం
కాకతీయ, హనుమకొండ : కురవి ఆలయ ఉద్యోగి జగన్ అకౌంట్ నుంచి రూ.10 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్ళు మాయం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ కురవైశ్వర్య సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి చెందిన ఉద్యోగి జగన్ బ్యాంకు ఖాతాలోంచి గుర్తు తెలియని సైబర్ మోసగాళ్లు భారీ మొత్తాన్ని కాజేశారు. సమాచారం ప్రకారం, జగన్ తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ఇటీవల జీతం సహా ఇతర ఆదాయం జమ కావడంతో మొత్తం రూ.10 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంటల వ్యవధిలోనే వరుసగా ట్రాన్సాక్షన్లు జరిగి మొత్తం మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు ఖాళీ చేశారు.
జగన్‌కు ఒక్కసారిగా మెసేజ్‌లు రావడం ప్రారంభమయ్యాక, ఆశ్చర్యపోయి వెంటనే సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించగా అప్పటికే మొత్తం డబ్బు మాయం అయిందని తెలిసింది. బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఫిషింగ్ లింక్ లేదా ఫోన్ కాల్ ద్వారా మోసగాళ్లు జగన్ అకౌంట్ వివరాలు సేకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు ఏఏ ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపై ట్రాకింగ్ మొదలుపెట్టారు. సాధారణ ప్రజలు ఇలాంటి సైబర్ మోసాలకు బలి కాకుండా సందేహాస్పద లింక్‌లు క్లిక్ చేయకూడదని, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సంఘటనతో కురవి ఆలయ సిబ్బంది, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


