ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ప్రమాదవశాత్తు పూరిగుడిసెకు మంటలు చెలరేగి సగానికి పైగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రత్న నరసయ్య రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఇంట్లో నుంచి మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. పూరిగుడిసె కావడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే ఇంటిలోని సుమారు 50 శాతం భాగం కాలిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇంట్లో ఉంచిన నగదు రూ.50 వేలతో పాటు బట్టలు, బియ్యం తదితర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని నరసయ్య వాపోయారు. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందన్నారు. ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన నరసయ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


