కాకతీయ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో అవినీతి బహిర్గతమైంది. కర్ణమామిడి గ్రామానికి చెందిన గ్రామ కార్యదర్శి వెంకటస్వామి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో పట్టుబడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ బాధితుడు తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్లో ఇల్లు కోసం గ్రామ కార్యదర్శి వద్ద దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఫైలు ముందుకు జరగాలంటే రూ. 20,000 లంచం ఇవ్వాలని వెంకటస్వామి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు చేసేది ఏమీ లేక ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
ఏసీబీ ప్రత్యేక బృందం ప్లాన్ ప్రకారం, బాధితుడు డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వబోయే సమయంలోనే గ్రామ కార్యదర్శిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న సాక్ష్యాలను అధికారులు రికార్డ్ చేశారు. ప్రస్తుతం వెంకటస్వామిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.
ప్రజలకు అందే సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరకుండా, లంచం పేరుతో అవినీతికి పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇటువంటి అవినీతి చర్యలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.


