- ఏక కాలంలో 12 చోట్ల దాడులు
- బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల పట్టివేత
- సలాబత్ పూర్, కృష్ణ చెక్ పోస్టుల్లోనూ నగదు పట్టివేత
- చెక్‌పోస్టులు ఎత్తేసినా కొనసాగిస్తున్న అధికారులు
- వసూళ్లకు పాల్పడుతూ వేధిస్తున్నట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు
- పకడ్బందీగా ఏక కాలంలో దాడులు
- ఉలిక్కిపడిన ఆర్టీఏలోని అవినీతి అధికారులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఆదివారం ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఏసీబీ బృందాల దాడులు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి. ఏక కాలంలో ఏసీబీ అధికారులు చెక్ పోస్టులపై తనిఖీలు నిర్వహించడంతో అవినీతి లింకులున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. రోజూ ఒక్కో చెక్ పోస్టులో లక్షలాది రూపాయాల మాముళ్లు మాములుగానే వసూళ్లు చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ట్రాన్స్‌పోర్టు వెహికిల్ యజమానుల నుంచి ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో పకడ్బందీగా ఏక కాలంలో దాడులు నిర్వహించడం గమనార్హం.
12 ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు
ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అడ్డగోలుగా అధికారులు, సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా సామాన్య ప్రజలు, వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 12 చోట్ల దాడులు నిర్వహించిన అధికారులు రూ.4లక్షల 18వేల 880ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాడులు నిర్వహించిన చెక్ పోస్టుల్లో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నల్గొండ జిల్లాలోని విష్ణుపురం (వాడేపల్లి), సూర్యపేట జిల్లాలోని కోదాడ చెక్ పోస్టు, తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లాలోని కృష్ణ అంతరాష్ట్రచెక్ పోస్టు, తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ అంతరాష్ట్ర చెక్ పోస్టు, నిర్మల్ జిల్లాలోని బైంసా చెక్ పోస్టు, అసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్‌పోస్టు, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్, పెందూర్తి చెక్‌పోస్టు, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ చెక్ పోస్టు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని ముత్తుగూడెం(పెనుబల్లి)లు ఉన్నాయి.
బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల పట్టివేత
ఆదిలాబాద్ జిల్లా బోరజ్ అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టు రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు.ఏసీబీ అధికారులను గుర్తించిన సిబ్బంది పారిపోయేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. సిబ్బంది నుంచి రూ.1.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.అలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. వాహనదారుల నుంచి వసూలు చేసినట్లుగా గుర్తించిన అధికారులు సిబ్బందిని రూ. 36 వేలను స్వాధీనం చేసుకున్నారు.
చెక్ పోస్టులు ఎత్తేసినా.. వసూళ్ల కోసమే కొనసాగింపు..!!
చెక్‌పోస్టుల తొలగింపు వల్ల వాహనాల సగటు వేగం పెంచడంతో పాటు.. ట్రాఫిక్ సమస్యను తగ్గించే లక్ష్యంతో చెక్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను తొలగిస్తూ ఆగస్టు నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దు ఉండే జిల్లాలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కొంతమంది రవాణా శాఖ అధికారులకు మాత్రం మింగుడు పడటం లేదు. చెక్‌పోస్టుల్లో ఎంవీఐ(మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్), ఏఎంవీఐలతోపాటు కానిస్టేబుల్స్, సిబ్బంది 24 గంటల పద్ధతిలో పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ అందించే సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే సమకూర్చాలని నిర్ణయించారు. తదనుగుణంగానే సర్వర్‌లో మార్పులు చేశారు. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీల పేరుతో వాహనదారులను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ తనిఖీలు చేపట్టడం గమనార్హం.


