కాకతీయ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖ ఏడీఈ అవినీతం సామ్రాజ్యం బయటపడుతోంది. ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక సోదాల్లో అంబేడ్కర్ బినామీల వద్ద భారీగా నగదు, విలాసవంతమైన ఆస్తులు, వ్యవసాయ భూముల పత్రాలు బయటపడ్డాయి.మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బినామీ సతీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడి చేసి, రూ. 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని లెక్కపెట్టడమే అధికారులకు గంటల తరబడి సమయం పట్టింది.
అంబేడ్కర్ బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. మొత్తం 18 చోట్ల జరిగిన ఈ సోదాల్లో, వివిధ ప్రాంతాల్లో విస్తారమైన ఆస్తులు, విలాసవంతమైన గృహాలు, వ్యవసాయ భూముల పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం అంబేడ్కర్ బినామీల పేర్లపై ఉన్న ఆస్తుల విలువ రూ. 200 కోట్లకు పైగా ఉందని ఏసీబీ అధికారులు గుర్తించారు. స్థలాలు, గృహాలు, ఫారమ్‌ల్యాండ్స్, బంగారం వంటి విలువైన ఆస్తుల జాబితాపై సుదీర్ఘంగా కొనసాగుతోంది.
అంబేడ్కర్ విధులు నిర్వర్తించే సమయంలో ప్రతి పనికీ లంచం తప్పనిసరి చేసేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రజలు పనులు జరగాలంటే బినామీల ద్వారా డబ్బులు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఏసీబీ సోదాలతో అంబేడ్కర్ అవినీతి సామ్రాజ్యం వెలుగులోకి రావడంతో ప్రజల్లో చర్చనీయాంశమైంది. సాధారణ ఉద్యోగి ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు ఎలా కూడగట్టగలిగాడన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.


