జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు
అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు భయాందోళనలకు లోనై అనవసరంగా నిల్వలు చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
ఇంధన కొరతపై కొందరు వ్యాప్తి చేస్తున్న అసత్య ప్రచారాల కారణంగా ప్రజల్లో ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు. అయితే జిల్లాలో ఎక్కడా కొరత లేదని, అన్ని పెట్రోల్ బంకుల్లో అవసరమైన మేరకు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇంధన నిల్వలపై ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలతో నిరంతరం సమీక్ష జరుగుతోందన్నారు. ప్రజలు అధికంగా కొనుగోళ్లు చేయడం వల్లే బంకుల వద్ద తాత్కాలికంగా కొరత కనిపిస్తున్నదని తెలిపారు. రామగుండంలోని డిపోల నుంచి పెట్రోల్ బంకులకు నిరంతర సరఫరా జరుగుతోందని, అవసరానికి అనుగుణంగా రీఫిల్ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా సాధారణ అవసరాల మేరకే ఇంధనం వినియోగించాలని కలెక్టర్ కోరారు.


