దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత
భర్త అవయాలు దానం
కాకతీయ ,ఖమ్మం: భర్త ఇక లేరని తెలిసిన తీవ్ర దుఃఖంలో కూడా, ఆయన అవయవాలను దానం చేసి మరికొందరికి ప్రాణదాతగా నిలిచింది ఖమ్మం జిల్లాకు చెందిన డిజిటల్ మీడియా మహిళ జర్నలిస్టు పాపినేని అనంత లక్ష్మి.వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన రైతు పాపినేని నాగేశ్వరరావు కుటుంబం ప్రస్తుతం ఖమ్మంలో నివాసం ఉంటోంది. నాగేశ్వరరావు మొక్కజొన్న విత్తన కంపెనీలో ప్రతినిధిగా పనిచేస్తుండగా, ఆయన భార్య అనంత లక్ష్మి డిజిటల్ మీడియా వెబ్ ఇంచార్జ్‌గా, సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.విధి నిర్వహణలో భాగంగా నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఐదు రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.వైద్యుల సూచన మేరకు, తన భర్త అవయవాలను దానం చేయాలని అనంత లక్ష్మి నిర్ణయం తీసుకుని, ఆ అవయవాల ద్వారా మరికొందరికి ప్రాణదాతగా నిలిచారు.నాగేశ్వరరావుకు భార్య అనంత లక్ష్మితో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.


