- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఫ్లాగ్ డే

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని(ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది నుండి ఇప్పటివరకు విధి నిర్వహణలో మరణించిన 191 మంది అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ చదివి వినిపించారు. శాంతిభద్రతల పరిరక్షణ కై ప్రాణత్యాగాలు చేసిన పోలీసులు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని, వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని కమిషనర్ తెలిపారు.
కరీంనగర్‌లో పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పాల్గొని మాట్లాడారు. నక్సల్స్ ప్రభావిత కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 47 మంది పోలీస్ ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో లింగంపేట గ్రామ శివారులో అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ మహేష్ బి. గితే హాజరయ్యారు. 192 మంది అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ తరఫున అక్టోబర్ 21 నుంచి 31వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు, క్యాండిల్ ర్యాలీలు, 2కే రన్, ఓపెన్ హౌస్, వ్యాసరచన, ఫోటో, వీడియో పోటీలు ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు.


