భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం
పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో ఫుడ్ ఫెస్టివల్ వైభవం
సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల అలరింపు
కాకతీయ కరీంనగర్/ కొత్తపల్లి : పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి పాఠశాలలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ పండుగ వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని ఐకమత్యాన్ని చాటిచెప్పారు.
విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంప్రదాయ దుస్తులు ధరించి ఆయా ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించేలా వేషధారణలో మెరిశారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ సందేశాన్ని ప్రతీ కార్యక్రమం స్పష్టంగా తెలియజేసింది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయ పాటలతో ఆవరణను సందడిగా మార్చారు. బోనాల పండుగను తలపించేలా పోతురాజుల వేషధారణలో విద్యార్థులు చేసిన విన్యాసాలు, డప్పుల దరువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వివిధ రాష్ట్రాల వంటకాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కలిసి భోజనం చేస్తూ పండుగను ఆస్వాదించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్నం రమేష్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, ఇతర రాష్ట్రాల సంస్కృతుల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో వెంకటరమణ, మహేశ్వర్, శ్రీధర్, లక్ష్మారెడ్డి, దామోదర్, జ్యోతి, కన్యాకుమారి, శంకరమ్మ, రజిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.


