ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి
కాకతీయ, నెల్లికుదురు : ప్రజా జర్నలిస్టు, ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీరామగిరి ముద్దుబిడ్డ మద్దెల శ్రీనివాస్ గౌడ్ అకాల అస్తమయం పట్ల నెల్లికుదురు మండల కేంద్రంలో జర్నలిస్టులు, సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నాటి విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల నేతలు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నెల్లికుదురు, నైనాల సర్పంచులు పులి వెంకన్న, యాసం సంధ్య రమేష్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ మానవీయ కోణంలో సమాజంలో దాగి ఉన్న సమస్యలను తన కలం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ప్రజా జర్నలిస్టుగా నిర్భయంగా, నిజాయితీతో వార్తలు రాసిన ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా వందలాది మంది విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు బోధించారని కొనియాడారు. ఆయన కుటుంబాన్ని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


