పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు..!
అనుచరుడికి మంత్రి పొంగులేటి కడసారి వీడ్కోలు
“నా రాజకీయ ప్రయాణంలో ఆయన పాత్ర మరువలేనిది” అంటూ భావోద్వేగం
కాకతీయ, కూసుమంచి/పాలేరు : రాజకీయం అంటే పదవులు, అధికారమే కాదు… అంతకుమించిన ఆత్మీయ అనుబంధమని మరోసారి నిరూపించారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి, తన వెన్నంటి నడిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యడవల్లి రామిరెడ్డి అకాల మరణం మంత్రిని తీవ్రంగా కలచివేసింది. శనివారం పాలేరులో నిర్వహించిన రామిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి పాల్గొన్న తీరు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా భావోద్వేగంగా మార్చింది.
అనుచరుడికి మంత్రి కడసారి వీడ్కోలు
అంత్యక్రియల సందర్భంగా మంత్రి పొంగులేటి తన అధికార హోదా, ప్రోటోకాల్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. తన అత్యంత సన్నిహిత అనుచరుడైన రామిరెడ్డికి చివరి వీడ్కోలు పలుకుతూ స్వయంగా పాడే మోసి శ్మశాన వాటిక వరకు నడిచారు. సాధారణ కార్యకర్తలు, స్థానిక నాయకులతో కలిసి భుజం భుజం వేసుకుని నడవడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఒక రాష్ట్ర మంత్రి అయి ఉండి కూడా, తన అనుచరుడిపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఇలా బహిర్గతంగా చాటుకోవడం అరుదైన ఘటనగా నిలిచింది. సీనియర్ నాయకుడు రామిరెడ్డి మృతితో పాలేరు గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది. ఆయనకు చివరి వీడ్కోలు పలకడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేలాదిమంది మధ్య అంత్యక్రియలు ముగియగా… ప్రతి ముఖంలో విషాదం స్పష్టంగా కనిపించింది.

“నా రాజకీయ ప్రయాణంలో ఆయన పాత్ర మరువలేనిది”
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“పార్టీ ఒక నిబద్ధత కలిగిన సీనియర్ నాయకుడిని కోల్పోయింది. నా రాజకీయ ప్రయాణంలో రామిరెడ్డి పాత్ర మరువలేనిది. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని అన్నారు. రామిరెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి ప్రవర్తన పాలేరు ప్రజలను మాత్రమే కాదు… రాజకీయ వర్గాలను కూడా కదిలించింది. అధికారానికి అతీతంగా అనుబంధానికి ఇచ్చిన గౌరవంగా ఈ సంఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.


