బీనామీతోతో మామూళ్ల దందా
ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ వసూళ్లు
యూపీఐ లావాదేవీలతో డబ్బుల మళ్లింపు
ఏసీబీ సోదాల్లో రూ.20 లక్షలు స్వాధీనం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : అవినీతిని అరికట్టాల్సిన అధికారే తన అధికారం ఉపయోగించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడిన ఘటన ఏసీబీ దాడుల్లో బయటపడింది. కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము తనకు పరిచయమైన టీచర్ జక్కాని వేణును బీనామీగా పెట్టుకుని మామూల్ల దందా నడిపిన సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 17, 2026 రాత్రి సుమారు 8.25 గంటలకు ఈ ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వేములవాడలో ఎస్‌హెచ్ఓగా పనిచేసిన కాలంలోనే ఒక బెల్లం వ్యాపారి నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేస్తూ అక్రమ సంపాదన సాగించినట్లు దర్యాప్తులో తేలింది. నేరుగా డబ్బులు తీసుకోకుండా మధ్యవర్తిగా టీచర్‌ను ఉపయోగిస్తూ 2022 నుంచి 2024 వరకు యూపీఐ లావాదేవీల ద్వారా భారీగా డబ్బులు సేకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమ వ్యవహారంలో జక్కాని వేణు తన ఎస్బీఐ, యూబీఐ బ్యాంకు ఖాతాలను వినియోగించి డబ్బులను స్వీకరించి వాటిని గుండేటి రాము అతని తండ్రి ఖాతాలకు బదిలీ చేస్తూ అసలు డబ్బు జాడను దాచిపెట్టే బెనామీ వ్యవస్థ నడిపినట్లు బయటపడింది. గుండేటి రాము నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో లేని రూ.20 లక్షల నగదు స్వాధీనం కావడం ఈ అవినీతి దందాకు ఘన ఆధారంగా మారింది. ఈ మొత్తం అక్రమంగా సంపాదించినదేనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ జడ్జి (ఎస్‌పీఈ & ఏసీబీ కేసులు) ఎదుట హాజరుపర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.


