సీడ్ కంపెనీ మోసం
ఆశ చూపించి విత్తనాలు విక్రయం
కొనుగోలు సమయంలో చేతులెత్తేసిన ఆర్గనైజర్లు
క్వింటాకు అధిక ధర చెల్లిస్తామని సాగుకు హామీ
ఇప్పుడు పంటను తీసుకెళ్లడానికి ముందుకు రాని వైనం
ప్రజావాణిలో గోడు వెల్లగక్కుకున్న గిరిజన రైతులు
ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత
న్యాయం చేయాలని గిరిజన రైతుల వేడుకోలు
కాకతీయ, కారేపల్లి : అమాయక గిరిజన రైతులను నమ్మించి విత్తనాలు వేయించి, పంట చేతికొచ్చే సమయానికి ఆర్గనైజర్లు ముఖం చాటేయడంతో తవసిబోడు గ్రామానికి చెందిన రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. సింగరేణి మండలంలోని రేలకాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధిత రైతులు తమ గోడును వెల్లగక్కారు. తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. పంటపై పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయిందని, ఇప్పుడు తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైరా ప్రాంతానికి చెందిన తీగల బంజారి నివాసి ఎస్.కె సైదా అనే వ్యక్తి, తవసిబోడుకు చెందిన భూక్యా చందర్ అనే ఏజెంట్ ద్వారా గ్రామంలోని రైతులను సంప్రదించినట్లు తెలుస్తోంది. క్రిస్టల్ కంపెనీకి చెందిన ఒక ప్రత్యేక మొక్కజొన్న విత్తనాన్ని సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని, క్వింటాకు 3200 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మాటలు నమ్మిన రైతులు సుమారు 45 ఎకరాల్లో పంట సాగు చేశారు. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మంచి దిగుబడి వస్తుందనే ఆశతో పంటను జాగ్రత్తగా పెంచారు. పంట కోతకు వచ్చిన తర్వాత ఆర్గనైజర్లను సంప్రదించగా వారు ఫోన్ ఎత్తడం మానేశారని రైతులు చెబుతున్నారు. కంపెనీని సంప్రదిస్తే అలాంటి విత్తనాలు తమ దగ్గర లేవని చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. తాము పూర్తిగా మోసపోయామని, ఇప్పుడు పండించిన పంటను ఎవరికి అమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాధిత రైతులు నరేందర్, రమేష్, వీరబాబు, నాగేశ్వరరావు, రాంబాబు, సీతారాం, దీప్లా, రాంచంద్, బాల తదితరులు కలిసి అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటన గిరిజన రైతులపై జరుగుతున్న మోసాలను మరోసారి బహిర్గతం చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్గనైజర్లను పిలిపించి పంట కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని, తమకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.


