హామీల హడావుడి… గెలిచాక గందరగోళం
శివాజీ విగ్రహంపై గ్రామంలో రాజకీయ చిచ్చు
కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. ఎన్నికల సమయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి, గెలిచిన తర్వాత వెనక్కి తగ్గారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శివాజీ జయంతి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించకపోగా, అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరిని ప్రేరేపించి అధికారులకు ఫిర్యాదులు చేయిస్తున్నారని గ్రామ యువత ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామ యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా చందాలు సేకరించి శివాజీ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఓ దాత తన సొంత స్థలాన్ని విగ్రహ ప్రతిష్టాపన కోసం ఇచ్చినప్పటికీ, అక్కడ కూడా ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ పెద్దలను పోలీస్ స్టేషన్కు పిలిపించి బైండోవర్ కేసుల హెచ్చరికలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది ఒక్క గ్రామానికే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలోని మరికొన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, విగ్రహ ప్రతిష్టాపన విషయంలో అధికారులు తటస్థంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


