ఎన్డీఏ కూటమిదే ఘన విజయం
నక్సల్ రహిత భారత్ వైపు అడుగులు
లాలూ, సోనియాకు కుమారుల భవిష్యత్ గురించి ఆలోచన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఆర్జేడీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 11న జరిగే పోలింగ్‌లో కమలం లేదా బాణం గుర్తుపై నొక్కకపోతే జంగిల్ రాజ్ తిరిగి వస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో నక్సల్ రహిత భారత్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన జమయీ సహా అనేక ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని గుర్తు చేశారు. జమయీ, భగల్పుర్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్న ఆయన, ఆర్జేడీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలకు బిహార్ అభివృద్ధిపై ఎలాంటి అజెండా లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ వారి పాలనలో పేద ప్రజల కోసం ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ వారి కుమారుల భవిష్యత్ గురించి తప్ప బిహార్ అభివృద్ధిపై ఆలోచన చేయరని ఎద్దేవా చేశారు.
బిహారీలను అవమానించారు
మేము గెలిస్తే కొత్త శాఖను ఏర్పాటు చేసి బిహార్‌ను వరదలు రాకుండా కాపాడేలా చర్యలు తీసుకుంటాం. అదే లాలూ కుమారుడు గెలిస్తే ఆయన అపహరణ (కిడ్నాప్) శాఖను తెరుస్తారు. గత 10 ఏళ్లలో మోదీ అనేక రోడ్లు, వంతెనలు, ఇథనాల్, చక్కెర పరిశ్రమలను తీసుకువచ్చారు. మాకు వచ్చే ఐదేళ్లు అవకాశం ఇస్తే బిహార్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తాం. మళ్లీ ఆ జంగిల్ రాజ్ పాలనను రాష్ట్రంలో అనుమతించకూడదు. బిహార్‌లో తొలి దశ ఎన్నికలు గురువారం ముగిశాయి. ఇందులో లాలూ – రాహుల్ పార్టీ తడుచుపెట్టుకుపోతుంది. అలాగే జమయీలో కూడా వారు ఖాతా తెరవకూడదు. జిల్లాలోని నాలుగు సీట్లు ఎన్డీఏ అకౌంట్లో పడాలి. ఇటీవలె లాలూ కుమారుడిని ఎవరో దేశంలో ఏ ముఖ్యమంత్రి మీకు ఇష్టమని అడిగారు. దీనికి బదులిస్తూ ఆయన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. ఆయన పార్టీ డీఎంకే బిహారీలను బీడీలతో పోల్చింది. వారంతా బిహారీలను అవమానిస్తూనే ఉంటారు. ఇంకా ఆయన పార్టీ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడంతో పాటు రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకుంది…అని అమిత్‌షా అన్నారు.


