- ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కీలకోపన్యాసం ..
- ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచి నుంచి మంత్రికి ఆహ్వానం
- దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రిగా రికార్డు
- ఈనెల 21 నుంచి 24 వరకు మెల్‌బోర్న్‌లో సదస్సు ..
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. ఈమేరకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచి మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం పలికారు. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్‌బాబు కావడం విశేషం. ఈనెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన ప్రగతిపై మంత్రి ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఈ రంగంలోని అనుకూలతలు.. అవకాశాలపై ఆయన మాట్లాడనున్నారు. రెండు ప్రాంతాల మధ్య ఆరోగ్యరంగంలో నూతన ఆవిష్కరణలు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, పరిశోధన భాగస్వామ్యాలు, ఆధునిక తయారీ రంగాల్లో సహకారం మరింత బలపడేలా చర్చలు జరగనున్నాయి.
రూ. 63 వేల కోట్ల పెట్టుబడులు..
ఈ ఆహ్వానం తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో గత రెండు సంవత్సరాల్లో ₹63,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్ రంగాల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదిగిన నేపథ్యంలో వచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తాజా సి బి ఆర్ ఈ నివేదిక ప్రకారం, హైదరాబాద్ ప్రపంచంలోని టాప్ 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ జాబితాలో చోటు దక్కిన ఏకైక భారత నగరంగా హైదరాబాద్ నిలిచింది. బయోఏషియా 2026 సదస్సులో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం భారీగా పాల్గొననున్నట్లు అంచనా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సదస్సు ఉపయోగపడుతుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం నాయకత్వానికి, అలాగే ఆస్ట్రేలియా ఆవిష్కరణ వ్యవస్థతో పెరుగుతున్న పరస్పర సహకారం, అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఇది బలమైన నిదర్శనం. ఈ ఆహ్వానం ద్వారా తెలంగాణ, ప్రపంచపటంలో లైఫ్ సైన్సెస్ రంగంలో కీలక కేంద్రంగా మరింత స్థిరంగా నిలవనుంది.


