గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళిక అవసరం
పారదర్శక పాలనతోనే ఆదర్శ గ్రామాలు
నూతన సర్పంచులకు శిక్షణలో కలెక్టర్ సత్యశారద
కాకతీయ, గీసుగొండ : నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకొని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సూచించారు. దేశంలోనే ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన *గంగదేవిపల్లి*లో జిల్లాలోని 11 మండలాల నూతన సర్పంచుల కోసం నాలుగు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గీసుగొండ, సంగెం, చెన్నారావుపేట మండలాలకు చెందిన 84 మంది సర్పంచులు పాల్గొన్న తొలి విడత శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకంగా పాలన సాగించాలని ఆమె హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ మహానగరం రాష్ట్రంలో రెండో రాజధానిగా అవతరించబోతుందని పలుమార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, వరంగల్ జిల్లా సర్పంచులు ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి స్మార్ట్ పరిపాలన అమలు చేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహనతో సమర్థవంతమైన పరిపాలన ఎలా చేయాలన్నదానిపై దిశానిర్దేశం చేయడమే ఈ శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి, ఎంపీడీవోలు, డిఎల్పీఓలు, స్వచ్ఛభారత్ కన్సల్టెంట్లు, సర్పంచులు, మండల కార్యదర్శులు పాల్గొన్నారు.


