శివనగర్‌లో ప్రైమరీ స్కూల్, హాస్టల్ నిర్మించాలి
కాకతీయ, ఖిలావరంగల్ : శివనగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న పాత హాస్టల్ భవనం కారణంగా స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ భవనం ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాథమిక పాఠశాలతో పాటు ఆధునిక వసతులతో కూడిన నూతన హాస్టల్ భవనం నిర్మించాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాకు ఆయన వినతిపత్రం అందజేశారు. శివనగర్‌తో పాటు పరిసర కాలనీల్లో ప్రాథమిక విద్యా సౌకర్యాలు తగిన స్థాయిలో లేకపోవడంతో చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యను మధ్యలోనే మానేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శిథిలావస్థలో ఉన్న పాత హాస్టల్ భవనం ప్రమాదాలకు కేంద్రంగా మారిందని, ఎప్పుడైనా అనుకోని ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ స్థలంలో ప్రైమరీ స్కూల్‌తో పాటు హాస్టల్ భవనం నిర్మిస్తే శివనగర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, ఇది విద్యాభివృద్ధికి కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కలెక్టర్‌ను కోరారు.


