- విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది
- విద్యార్థులకు స్కాలర్‌షిప్స్.. అధ్యాపకులకు జీతాలు లేవ్
- పిల్లలు కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేసే దుస్థితి దాపురించింది
- వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలి
- మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం సెంట్రల్ దగ్గర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి నరేష్ యాదవ్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కాలేజీ, స్కూలు యాజమాన్యాలు అనేకసార్లు అల్టిమేటం ఇచ్చినా ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదన్నారు. ప్రజల పట్ల బాధ్యత, నిజాయితీ లేదు.
లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆక్రందన కాబట్టి మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఈ వేదిక నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. తాత్సారం చేయకుండా.. శషబిశలు లేకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి నీకు నిధులు ఉన్నాయి. కానీ వీరికి ఇవ్వడానికి లేవా ?
కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే మీకు కమిషన్లు వస్తాయి. వాటిని ఢిల్లీకి పంపించుకోవచ్చు అనుకుంటున్నారు. అంటూ మండిపడ్డారు.
నిలదీస్తాం..
కాలేజీ, స్కూలు యాజమాన్యాలు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదని ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మాస్టర్స్ కోసం, ఉద్యోగాల కోసం వెళ్దామంటే సర్టిఫికెట్లు రాక సొంత డబ్బులు అప్పులు చేసి కట్టుకొని సర్టిఫికెట్ తీసుకుంటున్నారన్నారు. అంత గంభీరమైన సమస్య అయినా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. పిల్లలకు డైట్ చార్జీలు లేవు.
ఏజెన్సీలకు డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నం పెట్టలేక కలెక్టరేట్ల ముందట ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. విద్యా వ్యవస్థలో పదివేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. రీ యంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
దుర్మార్గమైన సర్కార్
మధ్యతరగతి పేద పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోవడానికి పెట్టిన స్కీం ఫీజు రియంబర్స్మెంట్.
కేసీఆర్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు బకాయిలు పెట్టారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండేళ్లయినా చెల్లించలేదు. నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పిల్లలపై చదువులకు పోవడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి తల్లిదండ్రులే మళ్లీ ఆ డబ్బులు కట్టి అప్పులు చేసి బజారున పడే పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక సమ్మెకు నోటు ఇస్తే పదివేల కోట్లలో 600 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాల కు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లకు స్టాఫ్ కు జీతభత్యాలు లేవు. ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ల పేరుట కొన్ని వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. ఆ పిల్లలకు సంవత్సరానికి 42 వేల రూపాయలు ఇస్తారు. వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఎంత దిక్కుమాలిన ప్రభుత్వమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ చార్జీలు చెల్లించకపోతే సప్లయర్స్ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.


