- ఏకశిల హాస్పిటల్‌లో అత్యాధునిక ఓ సి టి మిషన్ ఆవిష్కరణ
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరం వైద్య సేవల్లో మరో మైలురాయి చేరుకుంది. హన్మకొండలోని ఏకశిల హాస్పిటల్‌లో అత్యాధునిక ఓ సి టి (ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ) స్టంట్ మిషన్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ మిషన్‌ను హాస్పిటల్ ఎండి డా. జి. రమేష్ ఆధ్వర్యంలో చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఈ మిషన్ ద్వారా గుండె ఎంజియోగ్రామ్ సమయంలోనే రక్తనాళాల లోపలి భాగాలను అత్యంత స్పష్టంగా చూడవచ్చని తెలిపారు. రక్తనాళాల్లో ముసుకుపోయిన లేదా క్లిష్టంగా ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా అంచనా వేసి, వేయాల్సిన స్టంట్ సైజ్‌ను ఖచ్చితంగా నిర్ణయించేందుకు ఓ సి టి సాంకేతికత ఎంతో ఉపయుక్తమని తెలిపారు.
గతంలో స్టంట్ సైజ్‌ను అంచనా వేయడంలో ఖచ్చితత్వం లోపించడం వల్ల 10 నుంచి 15 శాతం స్టంట్లు మూసుకుపోయే ప్రమాదం ఉండేదని, అయితే ఓ సి టి మిషన్ సహాయంతో రక్తనాళాలను ప్రత్యక్షంగా వీక్షిస్తూ, సరైన కొలతలతో, సరైన స్థానంలో స్టంట్ అమర్చడం సాధ్య మవుతుందని తెలిపారు. దీంతో పాత పద్ధతుల్లో జరిగే లోపాలను నివారించవచ్చని చెప్పారు. ఓ సి టి మిషన్ ద్వారా వరంగల్ ప్రాంత ప్రజలకు గుండె సంబంధిత చికిత్సలు మరింత ఖచ్చితంగా, సురక్షితంగా అందనున్నాయని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్టులు డా.అనిల్, డా.రామకృష్ణారెడ్డి, డా.మధు, డా.వెంకన్న, డా.మల్లికార్జున్, డా.మాధవి, డా.లావణ్య (జనరల్ మేనేజర్), వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


