వలపు వల… లక్షల లూటీ
ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్
నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్
బెదిరింపులతో లక్షలాది రూపాయాలు వసూలు
100 మంది వరకు బాధితులు
భార్యాభర్తల బాగోతం బట్టబయలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఎరగా మార్చుకుని మెల్లగా పరిచయాలు పెంచి చివరకు బ్లాక్‌మెయిల్ దాకా వెళ్లిన భార్యాభర్తల దందా కరీంనగర్ రూరల్‌లో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ స్కామ్‌లో దాదాపు వంద మంది వరకు బాధితులుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు కరీంనగర్ రూరల్ పోలీసులు ఈ ఆగడాలకు అడ్డు కట్ట వేసి దంపతుల బాగోతాన్ని బట్టబయలు చేశారు. గత రెండేళ్లుగా కరీంనగర్ రూరల్ మండలం ఆరేపల్లిలోని శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్‌లో నివసిస్తున్న ఈ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేస్తూ పరిచయాలు పెంచుకునేవారు. అకౌంట్‌ను ఫాలో అయిన వారితో ఫోన్ ద్వారా సంప్రదింపులు పెంచి డబ్బులు తీసుకొస్తే అపార్ట్మెంట్‌కు రావాలని ఆహ్వానించేవారని పోలీసులు వెల్లడించారు. కరీంనగర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులు, యువకులు ఇలా అపార్ట్మెంట్‌కు వచ్చినట్లు తేలింది.
అపార్ట్మెంట్‌లో బాధితులు ఉన్న సమయంలో భర్త గుట్టుచప్పుడు కాకుండా వారి నగ్న వీడియోలను ఫోన్‌లో రికార్డు చేసి, అనంతరం అవే ఆయుధాలుగా మార్చేవారు. వీడియోలు వైరల్ చేస్తామని బెదిరిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పరువు పోతుందనే భయంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా డబ్బులు చెల్లించినట్లు సమాచారం. వసూలు చేసిన సొమ్ముతో అపార్ట్మెంట్ ఈఎంఐలు చెల్లించడం, టాటా కారు కొనుగోలు చేయడం, ఏసీలు, సోఫా సెట్లు, ఖరీదైన బెడ్స్‌తో విలాసవంతమైన జీవితం సాగించినట్లు పోలీసులు తెలిపారు. బుదవారం రోజున కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.
ఏడాది పరిచయం… రూ.14 లక్షల దోపిడీ
సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని భార్యాభర్తలు పథకం ప్రకారం తమ వలలో పడేసుకున్నారు. సదరు వ్యక్తి వారికి బాగా సన్నిహితంగా మారి భర్తతో కలిసి మద్యం సేవిస్తూ మహిళతో ఎక్కువసార్లు గడిపాడని తెలిపారు. ఈ క్రమంలో మాయ మాటలతో అపార్ట్మెంట్, కారు ఈఎంఐలు కూడా అతనితోనే చెల్లింపులు చేయించినట్లు పేర్కొన్నారు. డబ్బులు అయిపోవడంతో బాధితుడు కొంతకాలంగా రావడం మానేయగా వాట్సాప్ కాల్స్ ద్వారా ఒత్తిడి పెంచినట్లు సీఐ తెలిపారు. తన వద్ద ఇక డబ్బులు లేవని వదిలేయాలని కోరినా రూ.5 లక్షలు ఇస్తేనే మర్చిపోతామని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. డబ్బులు ఇవ్వకపోతే అతని నగ్న వీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని చంపుతామని కూడా బెదిరించినట్లు తెలిపారు. భయంతో చివరకు బాధితుడు లక్ష రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకుని శ్రీపురం కాలనీ బోర్డు వద్ద నగదు అప్పగించాడని సీఐ నిరంజన్ రెడ్డి వివరించారు. మిగిలిన రూ.4 లక్షలు రెండు రోజుల్లో పంపిస్తానని చెప్పిన బాధితుడు ఇప్పటివరకు మొత్తం రూ.14 లక్షల వరకు ఇచ్చానని ఇక తనను వేధించవద్దని వీడియోలను తొలగించాలని వేడుకున్నట్లు తెలిపారు.
బ్లాక్‌మెయిల్ దందాకు పోలీసుల బ్రేక్
24 గంటల్లో భార్యాభర్తల అరెస్ట్
వేధింపులు తాళలేక బాధితుడు బంధువులు, సన్నిహితులకు జరిగిన విషయం వెల్లడించగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఫోన్‌పే ద్వారా భార్యాభర్తలకు చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టగా బుధవారం ఉదయం టేస్టీ దాబా వద్ద ఫోన్‌లో మాట్లాడుతుండగా అనుమానాస్పదంగా కనిపించిన భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. బాధితులను నగ్నంగా చిత్రీకరించిన వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్లు, బాధితుడు ఇచ్చిన చెక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించినట్లు వెల్లడించారు. నిందితులైన భార్యాభర్తలు మంచిర్యాల జిల్లాకు చెందినవారని వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారని సీఐ నిరంజన్ రెడ్డి వివరించారు. గత కొంతకాలంగా కరీంనగర్‌లో నివసిస్తూ సోషల్ మీడియా వేదికగా బ్లాక్‌మెయిల్ దందా సాగించినట్లు తెలిపారు. కేసును 24 గంటల్లోనే ఛేదించిన రూరల్ పోలీస్ సిబ్బందిని ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.


