చిన్న వివాదం ఘర్షణగా మారి కత్తిపోటు
ముగ్గురికి తీవ్ర గాయాలు
కాకతీయ, గోదావరిఖని: చిన్న వివాదం తీవ్ర ఘర్షణగా మారి కత్తిపోట్ల ఘటనకు దారి తీసిన సంఘటన గోదావరిఖని మార్కండేయ కాలనీలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య జరిగిన ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఇంటి ముందు వ్యాపారం చేస్తున్న సమయంలో కస్టమర్లు సిగరెట్లు తాగడం వల్ల ఇంట్లోకి పొగ వస్తోందన్న కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో గడిచర్ల రామ్ కొబ్బరి బోండాలు కోయడానికి ఉపయోగించే కత్తితో గడిచర్ల సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ విభేదాలే ఈ దాడికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం.


