జాతరలో పేరుకే మీడియా కేంద్రం..!
కుర్చీలు కూడా ఏర్పాటు చేయని అధికారులు
నాయకులు–అధికారులకే పరిమితమైన అగ్రంపహాడ్ జాతర
కాకతీయ, ఆత్మకూరు : మినీ మేడారంగా పేరొందిన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో మీడియా కేంద్రం పేరుకే పరిమితమైందని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర కవరేజ్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన పాత్రికేయులకు ఎండోమెంట్ అధికారులు కనీస వసతులు కూడా కల్పించడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. జాతర ప్రారంభం నుంచి ముగింపు వరకు నిరంతరం వార్తా కథనాలు అందించే విలేకరుల కోసం ఏర్పాటు చేసిన మీడియా కేంద్రంలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత జాతరల్లో మీడియాకు తగిన సౌకర్యాలు కల్పించారని గుర్తు చేస్తూ, ఈసారి మాత్రం జాతర కమిటీ, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తున్నారు. మీడియాను నాలుగో స్థంభంగా గౌరవించాల్సిన అధికారులు, ఈ జాతరను నాయకులు–అధికారులకే పరిమితం చేస్తున్నారని విలేకరులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి మీడియా కేంద్రంలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


