మైనర్‌పై కామాంధుడి కాటు!
మాయమాటలు–భయపెట్టి బాలికపై లైంగిక దాడులు
గర్భవతి చేసిన యువకుడిపై ఫోక్సో కేసు
పినపాక మండలంలో దారుణ ఘటన
కాకతీయ, మణుగూరు/పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో చోటు చేసుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించి, భయపెట్టి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతి చేసిన యువకుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బయ్యారం ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం… పినపాక మండలానికి చెందిన ఓ యువకుడు అదే మండలంలోని పాఠశాలలో చదువుతున్న బాలికను మాయమాటలతో దగ్గర చేసుకున్నాడు. ఆపై భయపెట్టి తన మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
గర్భవతి అయిన బాలిక
కొంతకాలంగా బాలిక ఆరోగ్యంలో మార్పులు రావడంతో విషయం బయటపడింది. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అయినట్టు నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా బాలిక తల్లికి తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనర్‌పై లైంగిక దాడి అత్యంత తీవ్రమైన నేరమని, బాలికకు అవసరమైన వైద్య, మానసిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


