- నడిరోడ్డుపై మునిసిపల్ ట్రాక్టర్ నిలిపివేత
- ఎలాంటి పార్కింగ్ హెచ్చరికలు కూడా లేవు
- గమనించక బైక్‌పై వచ్చి ఢీకొన్న విద్యార్థి..అక్కడికక్కడే మృతి
కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి సోమవారం ఉదయం దుర్మరణం పాలయ్యాడు. డివైడర్లలో మట్టి పోయడానికి రోడ్డు పై నిలిపి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన వేములవాడ అక్షయ్ సాయి (18) అనే యువకుడు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తన స్నేహితుడిని తీసుకురావడానికి బైక్ పై హుజురాబాద్ నుంచి రంగాపూర్ గ్రామానికి వెళ్తున్నాడు.ఈ క్రమంలో హుజురాబాద్ పట్టణంలోని గెలాక్సీ సూపర్ మార్కెట్ ముందు డివైడర్లలో మట్టి పోయడానికి మున్సిపల్ ట్రాక్టర్ నిలిపి ఉంది.
వేగంగా బైక్‌పై వస్తున్న అక్షయ్ సాయి నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను గమనించకుండా దానిని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో అక్షయ్ సాయికి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్షయ్ సాయిని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అక్షయ్ సాయి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ రోడ్డు ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్‌ను రోడ్డు పై నిలిపేటప్పుడు సరైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


