కౌశిక్‌రెడ్డికి భారీ షాక్ !
సొంత గడ్డపై ఎమ్మెల్యేకు గట్టి ఎదురుదెబ్బ
హుజూరాబాద్‌లో బీఆర్ఎస్‌కు పరాభవం
30 వార్డులున్న మున్సిపాలిటీలో 8 స్థానాలకే పరిమితం
16 స్థానాలతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ వశం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయంతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ 16 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే అధికారాన్ని చేపట్టనుంది. ఇప్పటి వరకు హుజూరాబాద్‌పై బలమైన పట్టు ఉందని భావించిన భారత రాష్ట్ర సమితి కేవలం 8 స్థానాలకు పరిమితం కావడం పరాభవంగా మారింది. గతంలో ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ ఈసారి ఓటర్ల తీర్పుతో వెనుకడుగు వేసింది. ముఖ్యంగా ఈ ఫలితాలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు గెలుచుకోగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
కౌశిక్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు
హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గట్టి షాక్‌గా నిలిచాయి. సొంత నియోజకవర్గ కేంద్రంలోనే పార్టీ అభ్యర్థులను గెలిపించలేకపోవడం ఆయన నాయకత్వానికి తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు వ్యాఖ్యలు, ఘర్షణాత్మక వైఖరి, వివాదాస్పద రాజకీయాలతో వార్తల్లో నిలిచే ఆయన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆస్థాయిలో ప్రభావం చూపలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో మాత్రం ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధిపై దృష్టి సారించకుండా రాజకీయ ఘర్షణలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఓటింగ్ రూపంలో అసంతృప్తిని స్పష్టంగా తెలియజేశారని భావిస్తున్నారు. సొంత గడ్డపై ఎదురైన ఈ ఫలితం కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిణామంగా చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ హవా..
హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 30 వార్డుల్లో 16 స్థానాలు గెలుచుకుని సత్తాచాటింది. బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 5 వార్డుల్లో విజయం సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి రాజ్‌కుమార్ గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున మేకల స్వరూప, సునీత, గూడూరు అంజలి, ఇల్లందు సమ్మయ్య, జున్నోత్ భాస్కర్, పుణ్య, వెంకటేశ్వర్లు, బానోత్ వెంకట్, వెన్నెల, మహమ్మద్ ఖాలిద్, శ్రీలేఖ, రాంపల్లి శ్రీనివాస్, కోయాల్కర్ భారతీ, తాలపల్లి రమేష్, మొగిలి, సుహాసిని విజయం సాధించగా, బీఆర్ఎస్ నుంచి సమీరా గఫర్, నంది శ్రీనివాస్, ప్రతాప తార, సింధూజ, బండ నరేష్, రవీందర్ రావు, ప్రతాప మంజుల, కేసి రెడ్డి లావణ్య గెలిచారు. బీజేపీ తరఫున సుమలత, అనూష, మనోజ్, లక్ష్మీ దుర్గ, కొండా ప్రశాంతి విజయం సాధించారు.


