మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ!
తెలంగాణ ఎస్ఐబీ ఎదుట అగ్రనేతల లొంగుబాటు
కేంద్ర సెక్రటరీ దేవ్ జీ సరణాగతి
పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి సహా 17 మంది లొంగుబాటు
“పార్టీ చివరి అంకం” : ఛత్తీస్‌ఘడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ వర్మ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్–2 నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కేంద్ర మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎదుట లొంగిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి (అలియాస్ సంగ్రామ్) మరియు మరో 16 మంది కేడర్ కూడా ఆత్మసమర్పణ చేసినట్లు సమాచారం. దేవ్ జీ పార్టీ అగ్రనేతగా, మల్లా రాజిరెడ్డి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తుండటం వల్ల ఈ లొంగుబాటు మావోయిస్టు నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామంపై ఛత్తీస్‌ఘడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ వర్మ స్పందిస్తూ, దేవ్ జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. మల్లా రాజారెడ్డి కూడా లొంగిపోయినట్లు నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు చివరి అంకానికి చేరుకున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చరిత్రలో కీలక మలుపు
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత లొంగిపోవడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. గత ఏడాది మే నెలలో అప్పటి చీఫ్ నంబాల కేశవరావు (బసవరాజు) మరణానంతరం దేవ్ జీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆయన లొంగుబాటు పార్టీ వ్యూహాత్మక నిర్మాణానికి పెద్ద దెబ్బగా విశ్లేషిస్తున్నారు. మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆపరేషన్ కగార్–2ను దూకుడుగా అమలు చేస్తోంది. ఛత్తీస్‌ఘడ్–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని కరెగుట్ట అడవుల్లో భద్రతా దళాలు విస్తృత స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. దేవ్, రాజిరెడ్డిలను ప్రధాన లక్ష్యాలుగా గుర్తించి ప్రత్యేక దళాలు కదిలినట్లు సమాచారం. ఈ ఒత్తిడి కారణంగానే లొంగుబాటు జరిగిందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారీ రివార్డులు
తెలంగాణ ప్రభుత్వం దేవ్ జీపై రూ.25 లక్షల రివార్డు ప్రకటించగా, కేంద్ర స్థాయిలో ఆయనపై కోటి రూపాయల వరకు బహుమతి ఉన్నట్లు తెలుస్తోంది. మల్లా రాజిరెడ్డిపై కూడా గణనీయమైన రివార్డు ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన నేతలు తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం కింద ప్రధాన స్రవంతిలోకి రావడానికి సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్య విధానంలో జీవనం కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిని మీడియా ముందుకు తీసుకువచ్చి అధికారిక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. టాప్ స్థాయి నేతల లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్–2 నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం నక్సలిజం నిర్మూలన దిశగా కీలక మలుపుగా మారుతుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.


