- ప్రధాన నిందితుడు వెనుక భారీ శక్తులే ఉన్నాయి
- కేరళ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
- తాత్కాలిక నివేదికను సమర్పించిన సిట్
కాకతీయ, నేషనల్ డెస్క్ : శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువులో వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా అనే దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో వేగవంతమైన, కచ్చితమైన దర్యాప్తు జరగాలని సిట్‌ను జస్టిస్ రాజా విజయరాఘవన్ వి, జస్టిస్ కేవీ జయకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మంగళవారం ఈ కేసును సంబంధించిన సిట్ తన తాత్కాలిక నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. మరోవైపు దర్యాప్తు గోప్యతను కాపాడేందుకు హైకోర్టు సుమోటోగా కొత్త పిటిషన్‌ను నమోదు చేయాలని నిర్ణయించింది. దీనిలో ప్రస్తుత పిటిషన్‌లోని ఉన్నికృష్ణన్ పొట్టి, స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ మినహాయించాలని, బదులుగా ప్రభుత్వాన్ని, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, పోలీసులను చేర్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. బంగారం దొంగతనం జరిగిన సమయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు, కమిషనర్ తీసుకున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. దేవస్థానం బోర్డు అధ్యక్షుడు, ఉన్నికృష్ణన్ పొట్టికు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేమని తెలిపింది. దేవస్థానం మాన్యువల్ ఉల్లంఘనలపై కూడా తీవ్ర అనుమానాలు ఉన్నాయని చెప్పింది.
అసలు ఏంటీ ఈ వివాదం?
శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించడం జరిగింది. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది. అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.


