తౌడు లోడు లారీ బోల్తా
వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై తప్పిన ఘోర ప్రమాదం
డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో సురక్షితం
కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. మండల తహసిల్దారు కార్యాలయం ఎదుట *వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి*పై తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం… మంచిర్యాల నుంచి 387 తౌడు బస్తాల లోడుతో ఏలూరుకు వెళ్తున్న లారీ, రాయపర్తి శివారులోకి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పక్కకు ఒరిగిపోయింది. ప్రమాదంతో లారీలోని తౌడు బస్తాలు రోడ్డుపక్కన చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో లారీలో డ్రైవర్ శంకర్ రావు, క్లీనర్ సంతోష్ కుమార్ ఉండగా, వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


