అఖండ ఓ గుణపాఠం
హిందూ ధర్మంపై తప్పుడు ప్రచారాలకు చెక్
ప్రతి ఒక్క హిందువుతోపాటు భారతీయుడు చూడాల్సిందే..
ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమాను వీక్షించిన బండి సంజయ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఒక్క హిందువుతోపాటు ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ -2 అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టే కరోనా వంటి మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్‌ను కనుగొని ప్రపంచానికి అందించగలిగామని తెలిపారు బండి సంజయ్ కుమార్. సోమవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ‘అఖండ 2 -తాండవం’ సినిమాను బండి సంజయ్ వీక్షించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్‌తో సహా పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్‌తో కలిసి ఈ సినిమాను చూశారు. అనంతరం బోయపాటితో కలిసి బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు.
చాలా సంతోషంగా ఉంది..
‘అఖండ- 2 సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది. సంచలనాలకు మారుపేరు బోయపాటి శ్రీను. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారు. పరమేశ్వరుడు ఆవహించడంతో ఈ సినిమా చేసినట్లు ఉన్నారు. కమర్షియల్ హంగులకు అద్బుతమైన సందేశాన్ని ఇస్తూ తీసిన సినిమా. సనాతన ధర్మం గురించి సినిమా చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఈ దేశంపైన, సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నా తట్టుకుని నిలబడిదంటే… దానికి కారణం మనం నమ్ముకున్న సనాతన ధర్మమే. ఆ నిరంతర చరిత్రను అద్బుతంగా చూపించిన సినిమా అఖండ- 2. దేశ సరిహద్దులను సైనికులు రక్షిస్తే… ధర్మాన్ని సమాజం రక్షించుకోవాలి. అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా తప్పే. అన్యాయాన్ని ఎదురించి సమాజాన్ని రక్షించేవారే గొప్ప. సనాతన ధర్మం గొప్పతనం వినడం కంటే అఖండ -2 తాండవం సినిమా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై, భారతీయుడుపై ఉంది. మిగిలిన ఈ జీవితాన్ని ధర్మం, దేశం కోసం అర్పించాలని అఖండ-2 చెబుతోంది’ అని బండి సంజయ్ ప్రశంసించారు.


