కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని శంభునిపేటలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 టెన్త్ క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనం వేడుకల్లో కలుసుకొని తాము చదువుకున్న రోజులను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. తమకు పాఠాలను బోధించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రస్తుతం చదువుకున్న విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
ఈ సమ్మేళనాలు ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి ఉపయోగపడతాయన్నారు. లక్ష్యసాధనకు పూర్వ విద్యార్థులు శ్రమించాలని కోరారు. పూర్వ విద్యార్థులు తమ తమ పిల్లలకు మంచి చదువును అందించాలని, పిల్లల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జీవిత ప్రయాణంలో ఎదురైన సమస్యలను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శారదాబాయి, ఉపాధ్యాయులు బండ రవీందర్, పెరుమాండ్ల సాంబమూర్తి, భాస్కర్, రవీంద్రబాబు, తిరుపతి, శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


