గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు..!
– ఖాకీల వలలో ముగ్గురు మత్తు కేటుగాళ్లు
– ఒడిశా రాష్ట్రం,మలకనగిరి జిల్లా నుండి గంజాయి తరలింపు
– వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పోలీసులకు పట్టుబడిన 20కేజీల గంజాయి
– ఒక కారు,మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..
కాకతీయ,రాయపర్తి : రాష్ట్రాల సరిహద్దులు దాటుతూ సాగుతున్న గంజాయి దందా పోలీసుల నిఘాకు చిక్కింది.చెక్ పోస్టులు,పోలీసుల తనిఖీలను కళ్లుగప్పి వందల కిలోమీటర్ల దూరం నుండి మత్తు పదార్థాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది.శనివారం ఉదయం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పోలీసులు విశ్వసనీయ సమాచారంతో మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై హెచ్ పి పంపు వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో గంజాయితో OD30G8786 నెంబర్ గల కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కలిమిల తాలూకాకు చెందిన విక్రమ్ మండేల్,గౌతమ్ మండేల్,విప్రోజిత్ మండేల్ ఈ ముగ్గురు యువకులు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.ఈ నేపథ్యంలో సుమారు 20 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసామన్నారు.ఇంకా ఈ గంజాయి నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు.

* పక్కా ప్రణాళికతో రవాణా:
పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితులు రవాణాలో కొత్త పుంతలు తొక్కుతున్నారు.సాధారణ ప్రయాణికుల్లా నటిస్తూ,బ్యాగుల్లో ప్యాకెట్ల రూపంలో గంజాయిని దాచి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు.ఒడిశా నుండి మొదలైన ఈ మత్తు ప్రయానానికి రాయపర్తి మండల కేంద్రానికి చేరుకోగానే చెక్ పడింది.



