కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!
రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ
రూ.23 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్
రూ.60 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ భవనం
రూ.4 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్
గీతా వృత్తిదారులకు కాటమయ్య రక్షణ కవచాలు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం : మంత్రులు పొన్నం, సీతక్క
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో రూ.151 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు *వేం నరేందర్ రెడ్డి*తో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, రాష్ట్ర ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్ తదితరులు పాల్గొన్నారు. కేసముద్రం మండల కేంద్రంలో రూ.23 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.60 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ భవన నిర్మాణానికి, రూ.4 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బస్ స్టేషన్ భూమి కోర్టు కేసుల్లో ఉండటాన్ని పరిష్కరించి శంకుస్థాపన చేయడం విశేషమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మౌలిక సదుపాయాల విస్తరణ
కేసముద్రం మున్సిపాలిటీలో రూ.61.86 లక్షలతో రోడ్లు, డ్రైనేజీతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.2 కోట్లతో సేవలాల్ సంత్ బంజారా భవన నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా రోడ్ సేఫ్టీ క్లబ్ లోగోను మంత్రులు ఆవిష్కరించారు. గీతా వృత్తిదారులకు రూ.53.40 లక్షల విలువైన కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేశారు. తమ గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసముద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభినందించి సత్కరించారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, గిరిజన ప్రాంతాలకు మరో వెయ్యి ఇళ్లు అదనంగా ఇచ్చామని చెప్పారు. ఉచిత ఇసుకగా ఎనిమిది ట్రాక్టర్లు అందిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని, మిగిలిన హామీలను కూడా రాబోయే రోజుల్లో అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి, కేసముద్రం మండల కేంద్రం వందల కోట్ల అభివృద్ధి పనులతో కొత్త రూపు దాలుస్తోంది.


