పది వేల అప్పు.. ఓ నిండు ప్రాణం బలిగొన్న దారుణ ఘటన.
కొండాపురంలో మహిళ మృతి, ఒకరి పరిస్థితి విషమం.
కాకతీయ, నల్లబెల్లి : కేవలం పది వేల రూపాయల అప్పు వివాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ హృదయవిదారక ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలానికి చెందిన మేరగుర్తి మల్లయ్య, సమ్మక్క దంపతుల కుమారులు రమేష్ (38), సురేష్ (35). రమేష్ పెళ్లై ఇద్దరు పిల్లలకు తండ్రి కాగా, ఎనిమిదేళ్ల క్రితం భార్య మృతిచెందింది. అనంతరం గీసుకొండ మండలం మచ్చాపురం గ్రామానికి చెందిన స్వరూప (35)తో రమేష్ సహజీవనం చేస్తూ కొండాపురంలో స్థిరపడ్డాడు. స్వరూప భర్త మరణించగా ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
నాలుగు నెలల క్రితం సురేష్ తన అన్న రమేష్‌కి రూ.10,000 అప్పుగా ఇచ్చాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగినప్పటికీ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణలు కొనసాగాయి.
ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇటీవల పంచాయతీ కూడా జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం రాత్రి రమేష్ కుటుంబ సభ్యులు మరణవార్త కారణంగా అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో వేడి నీళ్లు పెట్టలేదని తల్లితో చిన్న గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్, తన డబ్బులు ఇవ్వాలని అన్నపై మరోసారి గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి సురేష్ కత్తి తీసుకొని రమేష్‌పై దాడి చేశాడు. రమేష్ పొత్తికడుపు, ఛాతి భాగంలో రెండు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఆపడానికి ప్రయత్నించిన స్వరూపపైనా సురేష్ దాడి చేసి కత్తితో పొడిచాడు. స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న వారిని గమనించి వెంటనే నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందింది. రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సురేష్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో కొండాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



