మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ
కాకతీయ, గీసుగొండ : ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. మండలంలోని మరియాపురం, గంగదేవిపల్లి గ్రామాలకు చెందిన రగుసాల మల్లయ్య, పెంతల కొమురయ్య, గూడ సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులను ఆయన కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ— పార్టీ కోసం నిరంతరం సేవలందించిన కార్యకర్తల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరమైన సమయంలో ఎలాంటి సహాయానికైనా ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, బీఆర్‌ఎస్ నాయకులు చల్లా వేణుగోపాల్ రెడ్డి, పూండ్రు జైపాల్ రెడ్డి, బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య, కంబాల కోటి, గడ్డమీద ధనంజయ్, వర్కాల మోహన్, రంపీస రాంబాబు, శోభన్ బాబు, బోనాల కుమారస్వామి, అడ్డాల భీమారావు, కౌడగాని చిరంజీవి, రాజ్‌కుమార్, ఆడెపు సురేష్, గోనె నాగరాజు, అజార్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.


