మెట్‌పల్లిలో వరుస దొంగతనాలకు చెక్
ఏడుగురు నిందితుల అరెస్ట్
15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం
కాకతీయ, జగిత్యాల: మెట్‌పల్లి పట్టణ పరిసరాల్లో వరుసగా చోటుచేసుకున్న దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలు, ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం మెట్‌పల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. గత జనవరిలో మెట్‌పల్లి పట్టణంలో ఆరు దొంగతనాల ఘటనలు నమోదయ్యాయని, వీటి ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టినట్లు చెప్పారు. డీఎస్పీ రాములు పర్యవేక్షణలో సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, అనిల్, నవీన్‌లతో బృందాలు పనిచేశాయని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించి మంగళవారం కొత్త బస్టాండ్ వద్ద వాహన తనిఖీల్లో పండుగ రమేశ్, పల్లెపు రమేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి 3.5 తులాల బంగారం, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి సమాచారం మేరకు మిగతా నిందితులైన గుంజే గంగాధర్, ఒర్సు గంగమణి, గైని కిరణ్, పెద్దూరు మల్లేశ్వరి, ఇందూరి రాకేష్‌లను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


