పర్యాటకులకు ములుగు పిలుపు
పచ్చని అడవుల మధ్య ఆహ్లాదం : మంత్రి సీతక్క
జలగలంచ వ్యూ పాయింట్ ప్రారంభించిన మంత్రి
కాకతీయ, ములుగు ప్రతినిధి : పట్టణాల కలుషిత వాతావరణానికి దూరంగా, పచ్చని అడవి అందాల మధ్య కుటుంబ సమేతంగా ఆరోగ్యవంతమైన పర్యటనకు ములుగు జిల్లా సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం తాడ్వాయి మండలం జలగలంచ వాగు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడవి అందాల వ్యూ పాయింట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బొగత జలపాతం ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోందని, గత ఏడాది జలగలంచ వాగు వద్ద ‘బ్లాక్ బెర్రీ ఐలాండ్’, తాజాగా తాడ్వాయి హట్స్ వద్ద సఫారీ ఏర్పాటు చేశామని తెలిపారు. నేడు ప్రారంభించిన వ్యూ పాయింట్ ఊటీ, కొడైకెనాల్‌కు దీటుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, పతంగుల పండుగ ఆనందాన్ని బాధ్యతతో జరుపుకోవాలని సూచించారు. చైనీస్ మాంజా వాడకం వల్ల మనుషులు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిపై స్వచ్ఛంద నిషేధానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.



