ప్రజా వంచనతో నిండిన బడ్జెట్
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ హామీలకు విరుద్ధంగా ఉందని, ఇది ప్రజా ప్రయోజనాల కంటే అంకెల గారడీతో నిండిన బడ్జెట్ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు విమర్శించారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి కీలక హామీలు బడ్జెట్లో కనిపించకపోవడం నిరాశ కలిగించిందన్నారు. గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే ఈసారి కూడా పెద్ద మార్పు లేదని, అప్పులపై ఆధారపడే ధోరణి కొనసాగుతోందని ఆరోపించారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు తగిన సహాయం లేదని, వృద్ధులకు పెన్షన్ పెంపు, నిరుద్యోగులకు భృతి వంటి అంశాలు పక్కనపడ్డాయని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన బంగారం, ఆర్థిక సాయం హామీలు అమలు కాలేదన్నారు. విద్య, ఆరోగ్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి తగిన కేటాయింపులు లేవని, దేవాదాయ శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఈ బడ్జెట్ అభివృద్ధి బడ్జెట్ కాదని, కేవలం ప్రచార బడ్జెట్ మాత్రమేనని యాదగిరి సునీల్ రావు విమర్శించారు.


